మంగళగిరి : ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అల్లర్లు, అశాంతి సృష్టించేలా జగన్ సైకో ముఠా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి వైసీపీ, జగన్ వైరస్‌లా మారాయంటూ ఫైర్ అయ్యారు. గత వైసీపీ పాలనలో గాడి తప్పిన పాలనను సీఎం చంద్రబాబు సరి చేస్తున్నారని చెప్పారు. బూతులు తిట్టడం, అనైతిక వ్యాఖ్యలు చేయడం, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ రాజకీయ సిద్ధాంతం అన్నారు. అధికారంలో ఉఉన్నా అధికారం లేకపోయినా ఇదే సిద్ధాంతాన్ని జగన్ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి అన్నా, తెలుగు వాళ్ల అభివృద్ధి అన్న జగన్‌కు గిట్టదన్నారు. విద్వేషాలు, విధ్వంసాలతో రాజకీయం చేయడం వైసీపీ డీఎన్ఏలోనే ఉందన్నారు సత్య ప్రసాద్.
మాట చాలా శక్తివంతమైనదని, మంచి మాట ఐక్యతను, చెడు మాట అశాంతిని పెంచుతుందని వైసీపీ నాయకులు గ్రహించాలని హితవు పలికారు. అమరావతి రైతులను దూషించడం, మండలి ఛైర్మన్‌పై దాడి చేయడం వైసీపీ రాజకీయ స్వభావానికి నిదర్శనం అన్నారు. . తోట చందయ్యను గొంతు కోసి చంపేశారు. అమర్ అనే 14 ఏళ్ల బాలుడి హత్య చేశారు. వాళ్ల ప్రకారం తాము ప్రతికార్య చర్యలు తీసుకోవడం లేదని అన్నారు అనగాని సత్య ప్రసాద్. ఆ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా పని చేస్తున్నాం. ఆ కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకున్నాం అని చెప్పారు.
