మంగళగిరి : రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు దాడులకు దిగవద్దని , కాస్త సంయమనం పాటించాలని సూచించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు , సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, లోకేష్ సూచనలతో టెలి కాన్పరెన్స్ నిర్వహించడం జరిగిందన్నారు. నిన్న జరిగిన సంఘటనపై పార్టీ జాతీయ అధ్యక్షులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాలను కాలరాస్తూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అరాచక పాలన సాగించారని ఆయన గుర్తు చేశారు. అయితే అలాంటి పాలనను వ్యతిరేకించాం. కానీ ఇప్పుడు మనమే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైన మార్గం కాదని ఆయన స్పష్టంగా చెప్పారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న పోలికలు, ప్రేరణలకు లోనై స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు పల్లా శ్రీనివాస రావు. తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన నిబద్ధత, ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు చట్టాన్ని గౌరవించే వారిగా సమాజంలో మంచి గుర్తింపు సంపాదించు కున్నారని, అదే మన పార్టీకి ఉన్న బలమైన బ్రాండ్ ఇమేజ్ అని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ కూడా వికసిత్ భారత్ లక్ష్యాలకు, స్వరాంధ్ర 2047 దిశగా రూపొందించబడిందని తెలిపారు. అమరావతికి రూ.1088 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.452 కోట్లు, గ్రామీణ రోడ్లకు రూ.500 కోట్లు, గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లకు పన్ను రాయితీలు, అరుదైన ఖనిజాల అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారని అన్నారు. వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పల్లా శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
