అనంతపురం జిల్లా : సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ రాష్ట్రంలో నీటి ప్రాజక్టులకు భారీ ఎత్తున నిధులను కేటాయించడం జరిగిందన్నారు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. గార్లదిన్నె మండలం బూదేడు గ్రామ సమీపంలోని 8వ డిస్ట్రిబ్యూటరీ వద్ద కెనాల్ ను అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, జోన్-5 ఇన్చార్జి నాని , అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ,ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ కేశవ రెడ్డి ,టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరస నాయుడుతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. గత ఐదు సంవత్సరాల్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మాజీ సీఎం జగన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. ఇవాళ దీక్షల పేరుతో ప్రజలను మభ్యపెట్టే డ్రామాలకు తెర తీస్తున్నారని అన్నారు. కేవలం 19 నెలల చంద్రబాబు నాయుడు పాలనలోనే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపు రూ. 8,000 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు.
ఇది కూటమి ప్రభుత్వ పనితీరుకు స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోందన్నారు బండారు శ్రావణి శ్రీ. హంద్రీ నీవా ప్రాజెక్టు కూటమి ప్రభుత్వ పాలనలో చారిత్రాత్మక విజయాన్ని సాధించిందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 3,780 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేయడంతో పాటు, కేవలం 190 రోజుల్లో 40 టీఎంసీల నీటిని తరలించి రికార్డు సృష్టించామని చెప్పారు ఎమ్మెల్యే. దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు జలకలతో కళకళ లాడుతున్నాయని పేర్కొన్నారు. మొత్తం 464 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 366 టీఎంసీల నీటిని నిల్వ చేసి చరిత్ర సృష్టించామన్నారు బండారు శ్రావణి శ్రీ.
