హైదరాబాద్ : ఇక నుంచి చెరువులను అందంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దాలని ఆదేశించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. మాధాపూర్‌లోని తమ్మిడికుంటతో పాటు సున్నం చెరువులను పరిశీలించారు. చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్షించారు. రెండు నెలల్లో చెరువుల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా తమ్మిడికుంటను పరిశీలించిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ సందర్శించారు. ఐటీ కేంద్రానికి చేరువుగా ఉన్న తమ్మిడికుంటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కాకుండా.. ఇక్కడకు వస్తే ఒత్తిడి కూడా దూరమమయ్యేలా అభివృద్ధి చేయాలని సీఎం సూచించిన విషయాన్ని చెరువు అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్న అధికారులకు కమిషనర్ చెప్పారు.
చెరువు చుట్టూ పచ్చదనం నిండుగా కనిపించాలని సూచించారు. బయట కంటే చెరువు చెంత 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువ ఉండేలా పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. చెరువు చుట్టూ పాత్ వేలు, కూర్చొని సేద దీరేందుకు వీలుగా సీటింగ్ వ్యవస్థ, పార్కులు, పచ్చిక బైళ్లు.. ఉండేలా చూడాలన్నారు. చెరువుల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములలను గుర్తించాలని అన్నారు. వాటిని పూర్తి స్థాయిలో విచారించి స్వాధీనం చేసుకుని చెరువు అభివృద్ధిలో భాగం చేయాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. ఆక్రమణదారుల పత్రాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సున్నం చెరువు చెంత సర్వే నంబరు 30, 31కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని.. ప్రభుత్వ భూమి ఉంటే అంగుళం కూడా పోకుండా రక్షించాలని అన్నారు. ఈ రెండు సర్వే నంబర్ల మధ్య ఉన్న ప్రభుత్వ భూమికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసు కోవడమే కాకుండా.. క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తమ్మిడికుంట చెరువుకు పై భాగంలో కింది భాగంలో ఉన్న ప్రభుత్వ భూములను తమదిగా క్లైమ్ చేస్తున్న వారి పత్రాలను పరిశీలించాలన్నీరు.
