అమరావతి : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని, ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం కల్పించిన ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్రానికి ఇప్పటి వరకు వచ్చిన పరిశ్రమలు, కల్పించిన ఉద్యోగాలతో పాటు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్ పై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో యువతకు 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ సర్కార్ లక్ష్యమని స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కంకణ బద్దులై పని చేయాలన్నారు. నైపుణ్యం పోర్టల్ మాదిరిగానే ప్రతిఒక్క ఉద్యోగాన్ని ఆధార్/కేవైసీ లింకేజీతో ట్రాక్ చేయాలని ఆదేశించారు. తమమ దృష్టిలో చిన్న పరిశ్రమలు, పెద్ద పెట్టుబడులు రెండూ సమానమేనని అన్నారు. ఉద్యోగాల కల్పనే మాకు ముఖ్యం అని కుండబద్దలు కొట్టారు. పరిశ్రమల స్థాపన, అనుమతుల విషయంలో సింగపూర్, దుబాయ్ కంటే సులభతరంగా ఉండాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని శాఖలవారీ అనుమతులు, ఎన్వోసీలను మ్యాపింగ్ చేసి వాటి స్థితి, గడువు ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. సమర్థవంతమైన చంద్రబాబు నాయకత్వం, కేంద్రం సహకారంతో త్వరలోనే అనుకున్న టార్గెట్ ను పూర్తి చేస్తామన్నారు.
