సోమందేపల్లి/శ్రీసత్యసాయి జిల్లా : చేనేతలకు ఏడాది పాటు అధిక ఆదాయంతో కూడిన ఉపాధి కల్పనతో ఆరోగ్య రక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్పస్టం చేశారు. ఉచిత విద్యుత్ పథకంతో నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు కలిగిందన్నారు. రాష్ట్రంలో చేనేత ఉత్పత్తులను పెంచడంతో పాటు నేతన్నలకు ఏడాది పాటు ఉపాధి కల్పనే లక్ష్యంగా టెక్స్ టైల్స్ పార్కులు, మెగా, మినీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన చేనేతలకు ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవకాశం ఇస్తున్నామన్నారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కొత్తపల్లిలో పలువురు చేనేత కుటుంబాలను వారి ఇంటికి వెళ్లి మంత్రి సవిత పలుకరించారు. చేనేతలకు మంత్రి సవిత స్వయంగా కరెంట్ బిల్లు అందజేశారు. ఉచిత విద్యుత్ పథకం అమలు వల్ల కలిగిన లాభాలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు ఆయా చేనేత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తంచేశారు.
ఉచిత విద్యుత్ పథకం ద్వారా తమకు ఆర్థిక మేలు జరిగిందన్నారు. జీరో పేమెంట్ విద్యుత్ బిల్లులను మంత్రికి చూపించారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, ఉచిత విద్యుత్ హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు, కూటమి ప్రభుత్వానికి చేనేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, నేతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకం ద్వారా మగ్గం నేతన్నలకు నెలకు రూ.720లు, సంవత్సరానికి రూ.8,640లు, మరమగ్గం మీద నేసే కుటుంబానికి నెలకు రూ.1,800లు, ఏడాదికి రూ.21,600లు లబ్ధి కలుగుతోందన్నారు. రాష్ట్రంలో 55,405 మగ్గం నేతన్నల కుటుంబాలకు, 8,611 మరమగ్గం మీద నేసే కుటుంబాలను ఉచిత విద్యుత్ పథకం కింద అర్హులుగా గుర్తించామన్నారు. మిగిలిన అర్హులకూ ఉచిత విద్యుత్ పథకం వర్తించేలా కృషి చేస్తున్నామన్నారు.
