అన్నమయ్య తొలి శతకం భక్తి మార్గానికి దివ్య మార్గదర్శకం

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన గిరిజా మనోహర్ బాబు

తిరుపతి : తెలుగు భక్తి సాహిత్యంలో అగ్రగణ్యులైన తాళ్ళపాక అన్నమాచార్యులు తొలి వాగ్గేయకారుడిగా విశిష్ట స్థానాన్ని పొందారని అన్నారు విశ్రాంతి తెలుగు ఆచార్యులు శ్రీ గిరిజా మనోహర్ బాబు. సంకీర్తనలలో భాగంగా రూపొందిన “తొలి శతకం” భక్తి, తత్వ, సాహిత్య పరంగా అపూర్వ ప్రాధాన్యాన్ని సంతరించుకుందని అన్నారు. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతి ఉత్సవాల సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు శ‌నివారంతో ఆర‌వ రోజుకుచేరుకున్నాయి.

ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన గిరిజా మనోహర్ బాబు మాట్లాడారు. శ్రీ‌ వేంకటేశ్వర స్వామివారి మహిమను, భక్తి మార్గాన్ని, జీవన సారాన్ని సులభమైన తెలుగు భాషలో ప్రజలకు చేరువ చేసిన కీర్తనల సమాహారమే ఈ తొలి శతకమని తెలిపారు. అన్నమయ్య సంకీర్తనలలోని ఆధ్యాత్మికత, సంగీత మాధుర్యం భక్తులను ఆహ్లాదపరుస్తూనే ఆత్మీయతను పెంపొందిస్తాయని చెప్పారు. అన్నమాచార్యుల సాహిత్య సంపదను పరిరక్షించి, ప్రచారం చేయడంలో టిటిడి కీలక పాత్ర పోషిస్తున్నదని, భక్తులు ఈ కీర్తనలను ఆచరిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని ఆకాంక్షించారు.

తిరుపతికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వెంకట శంకర భవన్ “అన్నమయ్య సంకీర్తనలు – వేదాంత ప్రసక్తి” అనే అంశంపై మాట్లాడారు. అన్నమయ్య కీర్తనల్లో వేదాంత తత్వం విస్తృతంగా ప్రతిఫలిస్తుందని తెలిపారు. జీవాత్మ–పరమాత్మ ఏకత్వం, మాయ స్వరూపం, భక్తి ద్వారా పరమార్థ సాధన వంటి గాఢమైన తాత్విక భావాలను అన్నమయ్య సులభమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా ఆవిష్కరించారని చెప్పారు.

అనంతరం పరిశోధకులు డాక్టర్ రాజశేఖర్ “అన్నమయ్య సంకీర్తనలు – కృష్ణ తత్వం” అనే అంశంపై ప్రసంగిస్తూ, శ్రీకృష్ణుని లీలలు, మాధుర్యభావం, గోపికాభక్తి వంటి అంశాలను అన్నమయ్య గాఢమైన ఆధ్యాత్మిక భావంతో వ్యక్తీకరించినట్లు తెలిపారు. ఆయన కీర్తనలు భక్తిని మాత్రమే కాకుండా జీవన తత్వాన్ని బోధించే ఆధ్యాత్మిక మార్గదర్శకాలుగా నిలిచాయని వివరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు లత, ఇతర అధికారులు, భక్తులు, సాహితీప్రియులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!