హైదరాబాద్ : డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బుల వంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్‌లు ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. హైదరాబాద్‌లోని మైండ్ స్పేస్‌లో సొసైటీ ఆఫ్ ది రెనల్ న్యూట్రిషన్ , మెటబాలిజం వార్షిక సదస్సును మంత్రి ప్రారంభించి ప్రసంగించారు. డయాబెటిస్, హైపర్ టెన్షన్, జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల కిడ్నీలు దెబ్బతిని ఎంతో మంది రోగులుగా మారుతున్నారని వాపోయారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సమస్య మరింత ఎక్కువగా ఉందన్నారు. ఈ నాన్ కమ్యునికెబుల్ డిసీజ్‌లను ఎదుర్కొనేందుకు ప్రజా ఆరోగ్య వ్యవస్థను సిద్ధం చేస్తున్నాం అని చెప్పారు దామోదర రాజ నరసింహ.
వ్యాధి నివారణపై అవగాహన, ఎర్లీ స్టేజ్‌లోనే వ్యాధుల గుర్తింపు, ట్రీట్‌మెంట్, రిహాబిలిటేషన్ వరకూ సమగ్రంగా ఆరోగ్య వ్యవస్థను తీర్చి దిద్దుతున్నాం అని అన్నారు. ప్రతి జిల్లాలో NCD క్లినిక్స్ ఏర్పాటు చేశాం అని తెలిపారు. జిల్లాల్లోనే కీమో థెరపీ అందించేలా అన్ని జిల్లా కేంద్రాల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు మంత్రి. రీజనల్ రిఫరల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.
రాష్ట్రంలో 46 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రకాల ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నాం అని చెప్పారు. అందులో సీరమ్ క్రియాటినిన్ పరీక్ష కూడా ఉందన్నారు. కిడ్నీ వ్యాధిని ప్రాథమిక దశకో గుర్తించేందుకు ఇది ఉపయోగ పడుతుందని వెల్లడించారు మంత్రి.
