అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ రావు

హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ అనుస‌రిస్తున్న విధానాల‌పై తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌మ ఇష్టానుసారం శాస‌న స‌భ‌ను నడుపుతున్నారంటూ ఆరోపించారు. అసెంబ్లీలో టీ బ్రేక్ అని చెప్పి ఒక‌సారి , ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి వస్తున్నాడని ఒకరోజు, కేరళ నుండి వస్తున్నాడని ఒకరోజు.. నాలుగు గంటలు వృథా చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒకరోజు పెండ్లి ఉందని పోతరు, ఒకరోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతున్నాడని అని సభ ఆపేస్తారంటూ మండిప‌డ్డారు. అసలు సభకు వచ్చి ప్రిపేర్ అవుతారా, ప్రిపేర్ అయ్యాక సభకు వస్తారా? అని నిల‌దీశారు హ‌రీశ్ రావు.

ఒకరోజు విద్యుత్ ఉద్యోగులకు చెక్కులు ఇవ్వాలని 4 గంటలు వృథా చేశార‌ని ఆరోపించారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వివిధ కారణాలతో అసెంబ్లీ సమయాన్ని ఇలా చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చింద‌ని, ఆ విష‌యం మ‌రిచి పోతే ఎలా అని భ‌గ్గుమ‌న్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు కూడా కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్టు అని ప్రశంసించాయని గుర్తు చేశారు. నితిన్ గడ్కరీ, పీవీ నరసింహన్ లాంటి ఎందరో ప్రముఖులు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణాకు వరప్రదాయిని అని అన్నారన్నారు.

ఇటీవల పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఎకనామిక్ సర్వేలో కాళేశ్వరం వల్ల సాగు భూమి విస్తీర్ణత పెరిగిందని చెప్పిందన్నారు హ‌రీశ్ రావు. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం వల్ల గత రెండేళ్లలో వేల ఎకరాల సాగు భూమి విస్తీర్ణత పెరిగిందని నివేదిక పెట్టాడన్నారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఒకసారి తెలంగాణకు వచ్చి ఇక్కడ రైతులను అడిగితే, నీళ్లు ఎప్పుడు వచ్చాయి, ఎలా వచ్చాయని స్పష్టంగా తెలుస్తుంద‌న్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడానికే కాళేశ్వరం గురించి తప్పుగా మాట్లాడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!