న్యూఢిల్లీ : అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫెమా ఖండు ఆధ్వర్యంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐతో విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. తన బంధువులకు కట్టబెట్టిన అక్రమ కాంట్రాక్టుల వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఫెమా ఖండూ రూ. 1,270 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డాడని, అధికార దుర్వినియోగంతో తన బంధువుల కంపెనీలకు అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టాడని పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ .
ఈ పిటిషన్ విచారిస్తూ, 15 ఏళ్లలో సీఎం తన బంధువులకు కట్టబెట్టిన ప్రతీ కాంట్రాక్టుపై విచారణ జరపాలని, 16 వారాల్లో నివేదిక అందజేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. దర్యాప్తునకు సంబంధించిన ఎలాంటి రికార్డులు ధ్వంసం కాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టం చేసింది. కాలపరిమితితో కూడిన చర్యను ఆదేశిస్తూ రెండు వారాల్లోగా సీబీఐ తన ప్రాథమిక విచారణను ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది. ఈ విచారణ, జనవరి 1, 2015 నుండి డిసెంబర్ 31, 2025 మధ్య కేటాయించిన ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల అమలును పరిశీలిస్తుందని తెలిపింది సుప్రీంకోర్టు. ఇదే కేసుకు సంబంధించి కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం అందేలా చూడాలని కోర్టు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందిన లేదా వారితో సంబంధం ఉన్న సంస్థలకు భారీ స్థాయి ప్రభుత్వ కాంట్రాక్టులు కేటాయించారని ఆరోపిస్తూ సేవ్ మోన్ రీజియన్ ఫెడరేషన్ ,వాలంటరీ అరుణాచల్ సేన దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి
