#ChinnaJeeyar : చిన‌జీయ‌ర్ .. స్వామీ స‌దా స్మ‌రామి

Chinna Jeeyar :  చెరగని చిరునవ్వు..ఆకట్టుకునే రూపం. మనసు దోచుకునే ప్రశాంతత. అన్నిటికి మించి మనుషుల్ని ప్రభావితం చేసే సమ్మోహనం. వెరసి అంతులేని విజ్ఞానం కలగలిసిన తేజో మూర్తి ఆయనే పరిచయం అక్కర్లేని చిన జీయర్ స్వామిజీ. సంస్కృతి , సాంప్రదాయాలు , ఆధ్యాత్మికత, టెక్నాలజీ , వైద్యం ఇలా ప్రతి దానిలో ఆయనకు అభినివేశం ఉంది . అంతకంటే ఎక్కువగా ఈ లోకం పట్ల ..సకల మానవ సమాజం పట్ల లోతైన అవగాహన వుంది. ఇది జగమెరిగిన సత్యం.

ఓ ముప్పై ఏళ్ళు వస్తే చాలు నీరస పడిపోయే కాలంలో సైతం ఆయన మాత్రం 60 ఏళ్ళు పూర్తి చేసుకున్నా ఇంకా చలనశీలిగా ప్రభవిస్తూనే వున్నారు. జ్ఞానపు వెలుగులు పంచుతున్నారు. సంచారం లోని జీవన సారాన్ని. బతుకులోని మార్మికతను మనకు బోధనతో సేద దీరుస్తున్నారు.

వేలాది మంది అభిమానులను, భక్తులను స్వామీజీ సంపాదించుకున్నారు. అడుగడుగునా వినమ్రత , భారతీయత , భక్తి తత్వం అగుపిస్తుంది . మనల్ని మెస్మరైస్ చేసేస్తుంది . అంతటి విద్వత్తు ఆయనలో ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక్కసారి స్వామీజీని దర్శించుకుంటే చాలు ఏదో తెలియని అనుభూతి కి లోనవుతాం అంటారు ప్రేమ పూర్వకంగా ,

ఆరాధన నిండిన భక్తులు. ఆయన సాగిస్తున్న ఈ భక్తి యాత్ర నిరాటంకంగా కొనసాగుతూనే వున్నది. ఎందరికో వెలుగులు పంచుతూనే పోతోంది. ఇదొక పవిత్రమైన మనుషుల మధ్య భావ భక్త బంధం అనే చెప్పాలి.

వీరి స్ఫూర్తి లైట్ హౌస్ లా వెలుగొందుతోంది. ఎక్కడో ఒక చోట అది తన వెలుగులతో ఈ భువిని పావనం చేస్తోంది. జీవితం మరణం మధ్యన సాగుతున్న ఈ అంతులేని ప్రయాణంలో తారసపడే ప్రతి సమస్యను ఆయన చిరునవ్వుతో స్వీకరిస్తారు. మనతో పాటే తాను లీనమై పోతారు . వెంటనే కళ్ళు తెరిచే లోపే పరిష్కారం చెప్పేస్తారు.

ఇదే స్వామీజీకి వున్నప్రత్యేకత. స్వచ్ఛమైన గాలి , సేద తీరే ప్రకృతి, మనసుకు మమతలు నేర్పించే ఆశ్రమం. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో. మనం కోల్పోయిన వన్నీ అక్కడ లభిస్తాయి . జీవితానికున్న సౌలభ్యం దానితో పాటే సాగే భవ బంధాల సారాన్ని చిటికెలో సెలవిస్తారు స్వాముల వారు.

ఆయన చల్లని చూపుల కోసం, స్వామిజీ ఆశీస్సుల కోసం భక్తులు రేయింబవళ్లు వేచి వుంటారు. అంతా నిశ్శబ్డం. స్వామి స్వరమే ఆదేశంగా ..భోధనగా మారిపోతుంది. భక్తుల గుండెల్లో ప్రేమ నిండి పోతుంది . సేవలో వున్న తృప్తి , ఇవ్వడంలో వున్న ఆనందం గురించి వివరిస్తారు. అంతా నిమ్మళంగా అలాగే నిలిచి పోతారు.

అదే ఆయన మహత్తు ..అదే ఆయన విద్వత్తు. ఎక్కడో ..ఏదో దాని కోసం వెతుకుతారు ..అంతా మీలోనే వుంది కదా అంటూ సారాన్ని బోధిస్తారు. పలు భాషల్లో ప్రావీణ్యం ..స్వామి వారికున్న సౌలభ్యం. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు . ఏదీ దాచుకోరు . దేహమే దేవాలయం . ప్రజలే దేవుళ్లుగా ఆయన తన ప్రస్థానాన్ని సాగిస్తున్నారు.

ఈ సంచారంలో వ్యక్తిగా , వ్యవస్ధగా కంటే ఎక్కువగా సంచారికి ఇబ్బందులు ఉంటాయి. అది ఎంతో కఠినం. దీనిని స్వీకరించాలంటే చాలా కష్టపడాలి. సాధన చేయాలి . కొన్ని రోజుల్లో వచ్చేది కాదు . అందుకే ఆయన స్వామీజీ అయ్యారు . మనం మానవ మాత్రులుగానే మిగిలి పోయామని కొందరు భక్తులు భాద పడతారు. లోకమంతటా ఆయన తిరిగారు .

అంతటా నెలకొన్న అశాంతిని గుర్తించారు. దీనికి ఉగ్రవాదం , ఆర్ధిక అసమానతలే కారణమంటారు. ప్రేమ తత్వమే కావాలని అంటారు. స్వీయ ఆరాధన , సర్వ ఆచరణ అనేది ప్రధానమని ..దీనిపైనే ద్రుష్టి సారిస్తారు . ఆధునిక స్వామిజిగా పేరు పొందారు.

లేటెస్ట్ గా వచ్చే అన్ని సాంకేతికాలు , వాటి ఉపయోగాల గురించి స్వామిజీ తెలుసుకుంటారు. కాలంతో పాటే ఆయన కూడా పోటీ పడతారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన నిత్య విద్యార్ధి. దారి చూపే గురువు. పక్క దారి పట్టకుండా చూసే ఆచార్యుడు. దిశా నిర్దేశనం చేసే మార్గదర్శకుడు. అంతేనా కదిలే నిఘంటువు ఆయన. స్వామిజీ ముందు నుంచి చదువరి .

విస్తృత మైన అవగాహన అంతా చదవడంలో .. ఆకళింపు చేసుకోవడంలో .. తనను తాను మలచుకున్నారు. తనకంటూ ఓ మార్గాన్ని చూసుకున్నారు. అదే భక్తి మార్గం . మట్టితో బంధం ముక్తి కోసం సాగించే రహదారిని గుర్తించారు. అదే ఆయనకున్న స్పెషాలిటీ. ఆయన భక్తుడే కాదు స్వర్వం తెలిసిన యోగి.

మార్క్స్ నుంచి నేటి ప్రపంచాన్ని ప్రభావితం చేసే మేనేజ్మెంట్ గురు ల దాకా చెప్పేస్తారు. స్థిత ప్రజ్ఞ స్వామీజీకి వున్న గొప్ప అసెట్. వామపక్ష భావజాలం ఓ వైపు మరో వైపు ఆధ్యాత్మికత రెండూ ఆయనలో ప్రవహిస్తూ ఉంటాయి. దేనిని ద్వేషించరు. ప్రేమే జీవన సాఫల్యాన్ని పొందేలా చేస్తుంది అంటారు. రామానుజాచార్యులు ఆయనుకు దైవం. అదే మూల మంత్రం . ఆయన సందేశాన్ని , ఆయన ఆశించిన దానిని స్వామిజీ ఆచరణలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

మానవ సేవే మాధవ సేవ అంటూ సాగుతున్నారు. పొట్ట కూటి కోసం చేసిన చిన్న చిన్న ఉద్యోగాలు ఆయనను మరింత రాటు దేలేలా చేశాయి . నీకు ఏది మంచిదో అది చెయ్యి . అంతా పెద్ద జీయర్ చూసుకుంటారు అంటూ తల్లి చేసిన ప్రభోదం మార్పునకు కారణమైంది. నేడు మన ముందు జ్ఞానాన్ని ఇచ్చే దీపమైనది.

చుండూరు సంఘటన , తిరుమలలో వేయి కాళ్ళ మంటపం విషయంలో స్వామిజీ వెనక్కి తగ్గలేదు. ధర్మమే ధైర్యం అంటారు. దైవం గూర్చి తెలుసుకోక పోవడం . తెలియకుండా మాట్లాడటం మంచి పద్ధతి కాదంటారు ఆయన. ద్వేషానికి దూరంగా వుండండి . ప్రేమను పంచండి . సేవలో వున్న భాగ్యాన్ని గుర్తించండి. సాయం చేసేందుకు పాటు పడాలి. నిరంతర అధ్యయనం చేయండి. దానిని ఆపకండి . వీలు చూసుకోండి ..కానీ చదవటం మాత్రం ఆపకండి అంటారు చిన జీయర్ స్వాములు .

ఏ ఒక్కరు ఆకలితో ఉండ కూడదన్నదే మన అభిమతం . అంతా సమానులే . మానవత్వమే మతం అదే జీవన వేదం అంటారు . నేటి విద్య పిల్లల్ని యంత్రాలుగా చేసేస్తోంది. వాళ్లకు విద్య బుద్ధులే కాదు సంస్కారం నేర్పాలి . అందుకు తల్లిదండ్రులు సాధన చేయాలి అంటారు. ఉత్తమ పౌరులుగా తీర్చాలి లేకపోతే సమాజంలో అశాంతి పెరుగుతుంది. ఇది లోకానికి మంచిది కాదని హెచ్చరిస్తారు.

స్త్రీలను గౌరవించాలి. వాళ్ళు బాగుంటేనే మనం బావుంటాం. వాళ్ళ కళ్ళలో నీళ్లు రాకుండా చూసే భాద్యత మనందరిది. మనలోని అనుభవంతా పల్లెల్లోంచి వచ్చిందే. అవి పచ్చగా ఉండాలి . ప్రజలంతా సుఖ శాంతులతో జీవనం గడపాలి . ప్రతో చోటా జ్ఞాన దీపాలు వెలుగుతూనే ఉండాలి .

వైద్యం , విద్య , వేదం , సేవా గుణం , భక్తి ..భోదన ..అధ్యయనం ఇవే ముందున్నవి. వీటితోనే స్వామి ప్రయాణం సాగిస్తున్నారు. ఎందరికో స్ఫూర్తి కలిగిస్తూ భారతీయ ఆత్మను తేజోవంతం చేస్తున్నారు. అందుకే స్వామీ సదా స్మరామి అంటూ స్మరించు కోవటమే..!

No comment allowed please