అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సాగు నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. బుధవారం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం-నలమల్ల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల, వరికపూడిశెల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులపై ఆరా తీశారు. రాష్ట్రంలో భూగర్భజలాల పెంపు, జల ధార, జల హారతి కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1, 2 పనులను వచ్చే ఏడాది మార్చి లోగా పూర్తి చేయాలని ఆదేశించారు చంద్రబాబు నాయుడు.
ట్విన్ టన్నెల్స్ లైనింగ్ పనులు 77 , అప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనులు 98 శాతం, హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 71 శాతం, ఇరిగేషన్ టన్నెల్ లైనింగ్ 76 శాతం పూర్తైనట్టు తెలిపారు అధికారులు. కేఎల్ బండ్ ఎర్త్ వర్క్, ఎంబార్క్‌మెంట్ పనులు ఈ ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఆర్ అండ్ ఆర్ కి సంబంధించి 49 కాలనీలు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి, మరో 20 కాలనీలు 2027 ఏప్రిల్ కల్లా పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. మొదటి దశలో మొత్తం 38,060 నిర్వాసిత కుటుంబాలకు, ఇప్పటి వరకు 16,763 కుటుంబాల తరలించడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి 8,518 కుటుంబాలు, 2027 ఏప్రిల్‌కు 12,779 కుటుంబాలు తరలించాలని సూచించారు సీఎం. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.27,089 కోట్లు వ్యయం అయినట్టు వెల్లడించారు. మరో రూ.5,108 కోట్లతో సివిల్, ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
